అవును! ఇప్పుడు టీడీపీ వర్గాల్లోనే ఈ మాట వినిపిస్తోంది. భావి టీడీపీ అధ్యక్షుడిగా ప్రచారంలో ఉన్న నారా లోకేష్.. ఇప్పుడు ఏం చేస్తున్నారు ? అంటే.. పిట్ట కబుర్లు చెబుతున్నారు ! అని సటైర్లు పేలుతున్నాయి. నిజానికి ఇది తీవ్రపరిణామంగానే భావించాలి. ఒకటి.. టీడీపీ ఇప్పుడున్న పరిస్థితిలో పుంజుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడో ఎన్నికలకు ముందు పుంజుకుందాంలే.. అనుకుంటే పొరపాటు చేసినట్టే. ప్రస్తుతం జగన్ దూకుడు పెంచుతున్నారు. కొన్ని కీలక విషయాల్లోనే ఆయనకు హైకోర్టు నుంచి వ్యతిరేకత వస్తోంది. కానీ, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు(నాడు-నేడు వంటివి) ఆగడం లేదు.
దీంతో పట్టణం, గ్రామీణ స్థాయిలో ప్రజల మధ్య జగన్ పేరు తారక మంత్రం మాదిరిగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు ఎక్కడికక్కడ పార్టీ మారుతున్నారు. పైకి పెద్ద పెద్ద నాయకులు పార్టీలు మారుతున్నప్పుడు మాత్రమే ప్రధాన మీడియా ఫోకస్ చేస్తోంది తప్ప.. గ్రామీణ స్థాయిలో వందల సంఖ్యలో కార్యకర్తలు పార్టీ మారుతున్నారు. అయినప్పటికీ.. టీడీపీలో చలనం కనిపించడం లేదు. అదే సమయంలో పట్టణాలు, నగరాలు, చాలా నియోజకవర్గాల్లో పార్టీని నడిపించే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అంతో ఇంతో లోకేష్ పుంజుకుని.. తన సత్తాను నిరూపించుకునే సమయమనే చెప్పాలి.
కానీ, కరోనాకు ముందు హైదరాబాద్ వెళ్లిన లోకేష్ కేవలం రెండు సందర్భాల్లోనే ఏపీలో అడుగు పెట్టారు. ఒకటి మహానాడుకు, రెండు అచ్చెన్నను పరామర్శించేందుకు. ఆ తర్వాత మళ్లీ ఆయన హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. మధ్యలో జేసీ ఫ్యామిలీని పరామర్శించారు. అయితే, నిత్యం ట్విట్టర్‌లో మాత్రం స్పందిస్తున్నారు. కానీ, ఈ బుల్లి పిట్ట కబుర్లు.. పార్టీ నేతల్లో ఆత్మస్థయిర్యం పెంచకపోగా.. పార్టీ పరిస్థితిపై నైరాశ్యం కలిగేలా చేస్తోంది. దీంతో పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఇదే పరిస్థితి మరో ఏడాది కొనసాగితే.. మొదటికే మోసం వస్తుందని, ఇప్పటికైనా .. లోకేష్ ధైర్యం చేసి. ప్రజల మధ్యకు రావాలని కోరుతున్నారు తమ్ముళ్లు. మరి ఆయన పిట్టకబుర్లు కట్టిపెట్టి బయటకు వస్తారో లేదో చూడాలి.