కీలక నేతలున్న ఆ నియోజకవర్గంలో టీడీపీ కాడి జారేసిందా

-

ఒక మాజీ మంత్రి,ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు అక్కడంతా రాష్ట్రస్థాయి నాయకులే ఉన్నారు కానీ పంచయాతీ ఎన్నికల్లో మాత్రం ఫలితం శూన్యం. కనీసస్థాయిలో పోటీ కూడా ఇవ్వలేక చేతులెత్తేశారు. అదే ఇప్పుడు టీడీపీలో చర్చకు దారితీస్తోంది. కర్నూలు జిల్లాలో కీలకమైన నంద్యాల నియోజకవర్గంలో టీడీపీ కేవలం రెండు పంచాయతీలు గెలవడం పార్టీ నేతలను కలవర పరుస్తున్నాయట.

 

కర్నూలు జిల్లాలో జరిగిన తొలి విడత పంచాయతీ పోరులో టీడీపీ చతికిల పడినా కొన్ని నియోజకవర్గాల్లో ఓ మోస్తరు స్థానాలు దక్కించుకుంది. అయితే జిల్లాలో కీలక మైన నంద్యాలపై పట్టున్న నాయకులు అక్కడి టీడీపీలో ఉన్నా.. ఆ ప్రభావం ఫలితాలపై కనిపించలేదన్న టాక్‌ వినిపిస్తోంది. తొలి విడతలో ఆళ్లగడ్డ, నంద్యాల, శ్రీశైలం నియోజకవర్గాల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఆళ్లగడ్డలో 104 పంచాయతీలు ఉంటే.. టీడీపీకి 22 దక్కాయి. శ్రీశైలంలో ఏడుచోట్ల గెలిస్తే.. నంద్యాలలో సైకిల్‌కు దక్కింది రెండే.

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఇటీవల కిడ్నాప్‌ కేసులో 18 రోజులపాటు హైదరాబాద్‌లో జైలులో ఉన్నారు. బెయిల్‌పై బయటకొచ్చిన తర్వాత పల్లెపోరుపై ఫోకస్‌ పెట్టారు. 22చోట్ల టీడీపీ జెండాను రెపరెపలాడించారు. నంద్యాలలోనే అంతా తారుమారైందనే ఆవేదన పార్టీ శిబిరంలో ఉందట. 2017లో జరిగిన నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికలో టీడీపీకి 26 వేల ఓట్ల మెజారిటీ దక్కింది. టీడీపీ బాగా బలపడిందని అనుకున్నారు. కానీ అదంతా వాపేనని 2019 ఎన్నికల్లో తేలిపోయింది. ఆ ఎన్నికల్లో ఓడిన తర్వాత టీడీపీ పరిస్థితి మరింత దిగజారింది.

మాజీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, సీనియర్‌ నేత ఏవీ సుబ్బారెడ్డి వంటి సీనియర్లు నంద్యాలలో ఉన్నా.. పంచాయతీ పోరులో చేదు ఫలితాలే వచ్చాయి. ఒకప్పుడు భూమా నాగిరెడ్డి ప్రాతినథ్యం వహించిన నియోజకవర్గం కావడంతో తప్పకుండా భూమా ఫ్యామిలీ ఇక్కడ పట్టు సాధిస్తుందని అంతా అనుకున్నారట. అసెంబ్లీ ఎన్నికలు ప్రతికూలంగా మారినా.. పల్లెల్లో పాగా వేస్తారని భావించింది కేడర్‌. కానీ.. రెండు పంచాయతీలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

నంద్యాల నియోజకవర్గంలో 32 పంచాయితీలు ఉంటే.. గోస్పాడు మండలంలోనే ఓ రెండు పంచాయతీలు దక్కించుకుండి సైకిల్ పార్టీ. నంద్యాల మండలంలో టీడీపీ ఖాతాలో ఒక్కటీ పడలేదు. నంద్యాల టీడీపీ ఇంఛార్జ్‌గా బ్రహ్మానందరెడ్డే ఉన్నారు. ఆయన చురుకుగా లేరన్నది క్యాడర్‌ చెప్పేమాట. టీడీపీ అధిష్ఠానం పిలుపు మేరకు అప్పుడప్పుడూ కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం తప్ప ఇతర విషయాలను ఆయన సీరియస్‌గా తీసుకోవడం లేదని సమాచారం.

మాజీ మంత్రి ఫరూక్‌ అనారోగ్య కారణాలతో చాలాకాలంగా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. ఏవీ సుబ్బారెడ్డికి, భూమ ఫ్యామిలీకి మధ్య గ్యాప్‌ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇక్కడ టీడీపీ నేతలు కలిసి కట్టుగా సాగే వాతావరణం లేదు. అందుకే నంద్యాల పంచాయతీ పోరులో సైకిల్‌ మొరాయించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news