ఏపీలో విపక్ష తెలుగుదేశం పార్టీలో వరుస పెట్టి వికెట్లు పడుతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలోనే మరో కీలక నేత, మాజీ ఎమ్మెల్యే సైతం టీడీపీకి షాక్ ఇచ్చి.. వైసీపీలోకి వెళ్లేందుకు ముహూర్తం కూడా పెట్టేసుకున్నారు. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్లిపోగా, మరికొందరు నేతలు, ఎన్నికల్లో ఓడిపోయిన వారు బీజేపీలోకి వెళ్లిపోయారు.. ఇక కొందరు వైసీపీ వైపు చూస్తున్నారు. ఇప్పుడు విశాఖపట్నం జిల్లా మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత పంచకర్ల రమేశ్‌బాబు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.
రమేశ్‌బాబు దసరా రోజున అంటే వచ్చే నెల ఎనిమిదవ తేదీన వైసీపీ కండువా వేసుకునేందుకు ముహూర్తం పెట్టుకున్నట్టు తెలిసింది. పార్టీ మారే ఉద్దేశంతో ఉన్న ఆయన బుధవారం చినముషిడివాడలోని శారదా పీఠానికి వెళ్లి స్వరూపానందేంద్ర సరస్వతిని దర్శించుకున్నట్టు తెలుస్తోంది. అక్కడే ఆయన పార్టీ మార్పు అంశం ప్రస్తావనకు వచ్చిందంటున్నారు. ఇక ఇటీవల ఎన్నికల్లో రమేశ్‌బాబు విశాఖ జిల్లా ఎలమంచిలి నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి కన్నబాబురాజు చేతిలో ఓటమి పాలయ్యారు.
ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన నైతిక బాధ్యత వహిస్తూ టీడీపీ జిల్లా రూరల్ పార్టీ అధ్యక్ష పదవికి సైతం రాజీనామా చేశారు. అప్పటి నుంచి పార్టీ కార్యకాలాపాలకు దూరంగా వుంటూ వస్తున్నారు. ఇక పార్టీ మారేందుకు రెడీ అయిన ఆయన వైసీపీ కీలక నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ద్వారా ఆ పార్టీలో చేరేందుకు ట్రై చేసి సక్సెస్ అయ్యారని అంటున్నారు. రమేశ్‌బాబు రాజకీయ ప్రస్థానం ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావంతో ప్రారంభమైంది.
గంటా అండదండలతో రాజకీయాల్లోకి ప్రవేశించిన పంచకర్ల 2009లో పెందుర్తి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో కాంగ్రెస్‌లో కొనసాగారు. ఇక 2014లో ఆయన టీడీపీ నుంచి ఎలమంచిలిలో పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తాజా ఎన్నికల్లో ఓడిపోయారు. పంచకర్లతో పాటు అనేక మంది టీడీపీ నేతలు కూడా పార్టీని వీడుతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద చూసుకుంటే విశాఖ జిల్లాలో ఆపరేషన్ టీడీపీ విషయంలో వైసీపీ బాగానే సక్సెస్ అవుతున్నట్లుగా తెలుస్తోంది.