ఏపీలో వరుసగా టీడీపీ నేతల అరెస్టులు కొనసాగుతున్నాయి. తాజాగా శుక్రవారం టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసారు. ఈ రోజు తెల్లవారుజామునే గుంటూరు జిల్లా చింతలపూడిలోని ధూళిపాళ్ల నివాసం వద్దకు చేరుకున్న పోలీసులు భారీ బందోబస్తు మధ్య ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కాగా ధూళిపాళ్ల నరేంద్ర ప్రస్తుతం సంగం డెయిరీ ఛైర్మన్‌గా ఉన్న విషయం తెల్సిందే. అయితే సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో ఏసీబీ అధికారులు ధూళిపాళ్లను అరెస్ట్ చేసారు. ఆయనపై 408, 409, 418, 420, 465 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
కాగా ధూళిపాళ్ల అరెస్ట్ ను టీడీపీ నేతలు ఖండిస్తున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ధూళిపాళ్ల అరెస్ట్ పై మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. సీఎం జగన్ ప్రజల ప్రాణాలను గాలికొదిలేసి ప్రతిపక్ష నాయకుల అరెస్టులతో రాక్షస ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు.
సంగం డైరీ ద్వారా ధూళిపాళ్ల కుటుంబం వేలాది మంది పాడి రైతులకు అండగా నిలిచిందన్న లోకేష్… ప్రభుత్వ అసమర్ధతను,దొంగ కేసులను ఆధారాలతో సహా ఎండగట్టినందుకే ధూళిపాళ్ల నరేంద్రపై కక్ష కట్టారని ఆరోపించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ ప్రభుత్వం ఆడిన ఒక డ్రామాని స్ట్రింగ్ ఆపరేషన్ తో బట్టబయలు చేసి సీఎం జగన్ మోహన్ రెడ్డి కుట్రలను బయటపెట్టినందుకే ఈ కక్ష సాధింపు చర్యలని మండిపడ్డారు. చట్టం ముందు జగన్ రెడ్డి అన్యాయం ఏనాటికి విజయం సాధించలేదని ఫైర్ అయ్యారు.