మహానాడు రోజున పీఎస్ లో లొంగిపోయిన టీడీపీ నేత!

-

ఇప్పటికే పార్టీ పరిస్థితి.. పార్టీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలతో తలపట్టుకున్న చంద్రబాబుకు ఉన్న కొద్దిపాటి నేతలతో కూడా కష్టాలు తప్పడం లేదు. గతంలో వనజాక్షి విషయంలో బాబు ఇచ్చిన భరోసానో ఏమో కానీ ప్రభుత్వ అధికారులపై బెదిరింపులు, భౌతిక దాడులను టీడీపీ నేతలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో టీడీపీ నేత కూన రవికుమార్ కూడా శ్రీకాకుళం జిల్లా పొందూరు తహసీల్దార్‌ రామకృష్ణను బెదిరించారు. దీంతో ఈ టీడీపీ నేతపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో గత మూడు రోజులుగా ఈ టీడీపీ నేత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు!

ఇలా అజ్ఞాతంలో ఉన్న కూన.. మహానాడు పర్వదినాన్ని పురస్కరించుకునో ఏమో కానీ… తాజాగా అజ్ఞాతం వీడారు! అవును… ఇంతకాలం అజ్ఞాతంలో ఉన్న టీడీపీ నేత, ప్రభుత్వ మాజీ విప్‌ కూన రవికుమార్‌ మహానాడు రోజున అజ్ఞాతం వీడి నేరుగా పీఎస్ లో లొంగిపోయారు. ఈయనపై పోలీసులు 353, 506, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు! దీంతో సరిగ్గా అదేరోజు అర్ధరాత్రే ఆయన ఇంటి నుంచి పరారయిపోయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కాగా… ఈ నెల 16న గోరింట గ్రామంలోని రామసాగరం చెరువులో రవికుమార్‌ సోదరుడికి చెందిన రెండు జేసీబీలు, నాలుగు టిప్పర్లతో మట్టిని అక్రమంగా తవ్వుతుండగా వీఆర్‌ఓ నుంచి ఫిర్యాదు రావడంతో తహసీల్దార్‌ అక్కడకు చేరుకుని వాహనాలను సీజ్‌ చేశారు. దీంతో రవికుమార్‌ తహసీల్దార్‌ కు ఫోన్‌చేసి బెదిరించారు. ఆ ఆడియో ఆలస్యంగా వెలుగుచూసింది. “వాహనాలు విడిచిపెట్టు.. లేకపోతే లంచం డిమాండ్‌ చేశావని నీ మీద కంప్లైంట్‌ చేస్తాను” అని కూన బెదిరించారు. “నా చేతిలో ఏం లేదు. సీజ్‌ చేసి అప్పగించేశాను” అని తహసీల్దార్‌ చెప్పడంతో.. ఈ టీడీపీ నేత దుర్భాషలాడుతూ.. “నువ్వు సీజ్‌ చేశావుగానీ కంప్లైంట్‌ చేయలేదని నాకు తెలుసు. చెప్పు ఎంత కావాలి.. పది వేలు కావాలా, లక్ష కావాలా ఎంత కావాలి” అంటూ ప్రలోభాలు పెడుతూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు.

Read more RELATED
Recommended to you

Latest news