వైకాపాకు చెందిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ను కాపాడేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఆరోపించారు. మాధవ్ వ్యవహారంలో వైకాపా ఇంతవరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని.. భయపడుతున్నారా? అని నిలదీశారు. ఆయనపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు తెదేపా తరఫున ఫిర్యాదు చేశామని.. చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో రామ్మోహన్‌నాయుడు మాట్లాడారు.
“గోరంట్ల మాధవ్‌పై చర్యల విషయంలో వైకాపా నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందనా లేదు. వెంటనే బర్తరఫ్ చేయిస్తామని.. డిస్మిస్ చేస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఇప్పుడేమో ఆ విషయాన్ని నిర్వీర్యం చేసేందుకు అది ప్రైవేటు వ్యవహారమని మాట్లాడుతున్నారు. మాధవ్‌పై చర్యలు తీసుకుంటే.. అదే పార్టీలో ఉన్న సగానికి సగం మందిపైనా చర్యలు తీసుకోవాలని భయపడుతున్నారా? మాధవ్ ఒక్కరే కాదు. వైకాపా నేతల్లో చాలా మందిపై అత్యాచార కేసులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లలో చూశాం. అలాంటి నేతలను వైకాపా ప్రోత్సహిస్తోంది. మాధవ్‌పై చర్యలు తీసుకుంటామని చెప్పి.. ఇప్పుడు ఆయన్ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ జగన్ ఆలోచనే. ఆయనకు ఎప్పుడూ రాజకీయమే ముఖ్యం తప్ప.. ప్రజలు, మహిళల ప్రయోజనాలు కాదనే విషయం అర్థమవుతోంది. మాధవ్‌పై చర్యలు మొదలు పెడితే వైకాపా సగం ఖాళీ అయిపోతుంది. అది గ్రహించే ఇప్పుడు మాటమార్చి ఆ విషయాన్ని పక్కదోవ పట్టించే పనిలో ఉన్నారు.” అని రామ్మోహన్‌రాయుడు అన్నారు.
“ఒక ఎంపీ వీడియో అలా వస్తే మాకూ సిగ్గుచేటు. అందుకే ఈ వ్యవహారంపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశాం. ఓ వైపు ఆ వీడియోపై మాట్లాడాలంటే మాకే సిగ్గుగా ఉంది. కానీ మహిళల రక్షణ, పార్లమెంట్ గౌరవం కాపాడాల్సిన బాధ్యత సాటి ఎంపీలుగా మాపై ఉంది. ఇలాంటి వీడియోలు బయటకు వచ్చినపుడు ప్రజలుకు పార్లమెంట్‌పై ఉన్న నమ్మకం దిగజారిపోతుంది. అందుకే స్పీకర్‌కు ప్రత్యేకంగా ఓ లేఖ అందజేసి.. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఎంపీపై చర్యలు తీసుకోవాలని కోరాం.” – రామ్మోహన్‌రాయుడు, టీడీపీ ఎంపీ