తెలంగాణలోని హుజూర్‌నగర్ శాసన సభ ఓట్ల లెక్కింపు నిన్న ముగిసిన విషయం తెలిసిందే. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసిన సైదిరెడ్డి 43359 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. అయితే తెలంగాణలోని హుజూర్ నగర్ లో తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్లను, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ సాధించిన సీట్లను పోలుస్తూ, వైఎస్అర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పీ వరప్రసాద్ పెట్టిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.
హుజూర్ నగర్ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థికి 1,895 ఓట్లు రాగా, ఈ సంఖ్యలోని అంకెలన్నీ కలిపితే 23 వస్తుందని, అన్నే సీట్లను ఏపీలో ఆ పార్టీ గెలుచుకుందని ఆయన గుర్తు చేశారు. ఇదో అద్భుతమని వ్యాఖ్యానించారు. 23 సంఖ్య తెలుగుదేశం పార్టీని నడిపిస్తోందని, “హుజూర్ నగర్ లో తెలుగుదేశంకి వచ్చిన ఓట్లు 1895. 1 8 9 5 = 23. భగవంతున్ని భక్తుడిని అనుసంధానించేది అంబికా దర్బార్ బత్తి… ఓటమిని తెలుగుదేశాన్ని అనుసంధానించేది 23” అని ఆయన ట్వీట్ చేశారు.