అడిలైడ్ డే నైట్ టెస్టులో టీమిండియా బౌలర్లు ఇరగదీశారని సంబర పడే లోపే బ్యాట్స్‌మెన్ బొక్క బోర్లా పడ్డారు. బౌలర్లు చక్కని బౌలింగ్‌తో ఆకట్టుకున్నా బ్యాట్స్‌మెన్ దారుణంగా విఫలమయ్యారు. పలువురు బ్యాట్స్‌మెన్లు డకౌట్ కాగా, మిగిలిన వారు కేవలం సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. వచ్చిన వారు వచ్చినట్లే పెవిలియన్‌లో ఏదో పని ఉన్నట్లు వెను దిరిగారు. చరిత్రలో లేనంత భారీ అవమానాన్ని భారత్ అడిలైడ్ టెస్టులో మూటగట్టుకుంది. సైకిల్ స్టాండ్‌ను తలపించిన భారత బ్యాటింగ్ లైనప్ అభిమానుల ఆశలను అడియాశలను చేస్తూ టెస్టును నట్టేట ముంచింది.
అడిలైడ్ టెస్టులో భారత బౌలర్లు ఆసీస్‌ను మొదటి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే కట్టడి చేసి కొన్ని పరుగుల ఆధిక్యాన్ని ఇచ్చారు. బౌలర్లు విజృంభించారని, బ్యాట్స్‌మెన్ చక్కగా ఆడి టార్గెట్ పెడితే ఆసీస్ ఓటమి ఖాయమని అభిమానులు ఆశపడ్డారు. కానీ అంచనాలు తారుమారయ్యాయి. భారత బ్యాట్స్‌మెన్ నిర్లక్ష్యపూరిత ధోరణితో చెత్త షాట్లను ఆడి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్లను సమర్పించుకున్నారు. దీంతో చరిత్రలోనే టెస్టు మ్యాచ్‌లలో భారత్ ఒక ఇన్నింగ్స్‌లో అత్యల్ప స్కోరును నమోదు చేసింది. అడిలైడ్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ కేవలం 36 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఆసీస్‌కు విజయం సునాయాసం అయింది.
భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 244 పరుగులు చేయగా.. కోహ్లి రాణించాడు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి సహా బ్యాట్స్‌మెన్ అందరూ దారుణంగా విఫలమయ్యారు. వచ్చినవారు వచ్చినట్లే వెనక్కి తిరిగారు. ఈ క్రమంలో భారత్ దారుణ వైఫల్యాన్ని అభిమానులు జీర్ణించుకోలేక.. సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు జట్టు కూర్పు సరిగ్గా లేదని మండిపడుతున్నారు. మరి రెండో టెస్టుకైనా పటిష్టమైన జట్టుతో భారత్ ఆసీస్‌తో బరిలోకి దిగుతుందో, లేదో చూడాలి.