కృషి, పట్టుదల ఉండాలే గానీ ఎవరైనా ఏ రంగంలో అయినా అద్భుతాలు సాధించవచ్చు. శ్రమ, ఓపిక ఉండాలి. అంకిత భావంతో పనిచేయాలి. అలా చేస్తే ఏ రంగంలో పనిచేసినా విజయం వరిస్తుంది. సరిగ్గా ఈ విధంగా అనుకున్నాడు కనుకనే అతను అమెరికాలో రూ.లక్షల్లో నెలకు వేతనం లభించే సాఫ్ట్‌వేర్ జాబ్‌ను వదిలిపెట్టాడు. సొంత ఊరికి వచ్చి వ్యవసాయం చేస్తూ విజయం సాధించాడు. తోటి రైతులకు ఆ యువ రైతు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
తెలంగాణ రాష్ట్రం కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి గ్రామానికి చెందిన దేవరపల్లి హరికృష్ణ అనే 39 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ 10 ఏళ్ల పాటు హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగిగా పనిచేశాడు. తరువాత 5 ఏళ్లు అమెరికాలో ఉద్యోగం చేశాడు. అయితే వ్యవసాయం మీద మక్కువతో అతను ఆ జాబ్ వదిలిపెట్టి సొంత గ్రామానికి వచ్చి తమకు ఉన్న 35 ఎకరాల పొలంలో పలు పంటలను పండించడం మొదలు పెట్టాడు. వరి, పసుపు, మిరప, కొకొవా, ఆయిల్ పామ్, కొబ్బరి పంటలను వేసి విజయం సాధించాడు.
హరికృష్ణ తన పంటలకు కృత్రిమ ఎరువులను వాడడు. కేవలం సేంద్రీయ ఎరువులనే వాడుతాడు. అందుకనే అతను వేసే పంటలకు అధిక దిగుబడిని సాధిస్తున్నాడు. ఇక అతను తన పంటలను హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్, విజయవాడ, గుంటూరులకు తరలించి అమ్ముతూ లాభాలు సంపాదిస్తున్నాడు. తన పొలంలో పండే పసుపును, మిరపకాయలను ప్రాసెస్ చేసి పొడిలా మార్చి తానే స్వయంగా అమ్ముతున్నాడు. దీంతో ఎన్ఆర్ఐలు సైతం అతని వద్ద ఆయా ఉత్పత్తులను కొనేందుకు వస్తున్నారు.
కాగా హరికృష్ణ చేస్తున్న వ్యవసాయానికి తోటి రైతులు కూడా ఆకర్షితులై అతని వద్దకు వచ్చి వ్యవసాయంలో మెళకువలను నేర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఆర్గానిక్ వ్యవసాయంపై అతను గతంలో ఆన్ లైన్ ట్రెయినింగ్ ప్రోగ్రామ్ కూడా నిర్వహించాడు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం రైతు దినోత్సవం సందర్భంగా రాష్ట్రానికి చెందిన మొత్తం 5 మంది రైతులను ఎంపిక చేసి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో చర్చా కార్యక్రమానికి పంపించగా.. ఆ 5 మంది రైతుల్లో హరికృష్ణ కూడా ఉన్నాడు. ఈ క్రమంలో హరికృష్ణ తన వ్యవసాయ పద్ధతులతో ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. అతని వ్యవసాయం అందరినీ ఆకట్టుకుంటోంది.