ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయ్యిందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ప్రజలను మభ్య పెట్టి కాంగ్రెస్ గెలిచిందని ఆరోపించారు. గృహలక్ష్మీ పథకం రద్దుతో లక్షలాది మంది రోడ్డున పడతారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అసహనం వ్యక్తం చేశారు. దళితబంధు రెండో విడత లబ్ధిదారుల ఎంపిక పూర్తి అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం దళితబంధును పట్టించుకోవడం లేదన్నారు. రైతు భరోసా కింద ఇస్తామన్న రూ.15వేలు ఇంకా ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే దాకా కాలయాపన చేయాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని ఆరోపించారు.
ఫార్మా సిటీ రద్దు ప్రకటనతో భూముల ధరలు పడిపోయాయని,ఎలాంటి అవగాహన లేకుండానే మంత్రులు మాట్లాడుతున్నారని కడియం శ్రీహరి అన్నారు. ఇచ్చిన హామీలపై స్పష్టత కాంగ్రెస్ ఇంకా ఇవ్వడం లేదన్నారు. మోసపూరిత ప్రకటనలు చేయడం కాంగ్రెస్ మానుకోవాలని సూచించారు. నమ్మి ఓటేసిన యువతకు కాంగ్రెస్ మొండిచేయి చూపించిందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు.