నయిమ్ డైరీస్ సినిమాను అడ్డుకున్నారు తెలంగాణ ఉద్యమకారులు. తెలంగాణ ఉద్యమ కారిని బెల్లి లలితను కించపరిచే విధంగా సినిమాలో సన్నివేశాలు ఉన్నాయని ఆరోపణలు చేస్తున్నారు తెలంగాణ ఉద్యమకారులు… ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సంధ్య థియేటర్ వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఆందోళనకు దిగారు. థియేటర్ ముందు బైఠాయించి.. ఆందోళనకు దిగారు. నయీమ్ డైరిస్ సినిమా పోస్టర్ లను, ఫ్లెక్సీలను చించివేసి దహనం చేశారు ఉద్యమకారులు.
సంధ్య 35 ఎం ఎం థియేటర్లో సినిమా విడుదల కాకుండా అడ్డుకున్నారు ఉద్యమకారులు. ఈ సినిమా ను రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించామని.. తెలంగాణ ఉద్యమకారులను కించపరిచే సినిమాలు రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామని వెల్లడించారు.
ఉద్యమకారులకు అన్యాయం జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపణలు చేస్తున్నారు ఆందోళన కారులు…అయితే దీనిపై సంధ్య థియేటర్ మేనేజర్ మధుసూదన్ స్పందించారు. కొంత మంది ఉద్యమకారులు వచ్చి సినిమా విడుదలను అడ్డుకున్నారని.. మా యాజమాన్యానికి విషయాన్ని తెలియజేశామని పేర్కొన్నారు. మార్నింగ్ షో సినిమాను నిలిపివేశామని… యాజమాన్యం నుండి వచ్చే సమాచారాన్ని బట్టి సినిమా విడుదల పై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.