బడ్జెట్‌లో కేటాయింపులకు.. చేస్తున్న ఖర్చులకు పొంతన లేదు : వైఎస్ షర్మిల

-

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌-2023పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. ప్రజాప్రస్థాన యాత్రలో భాగంగా జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్ పరిధిలోని చిల్పుర్ మండలంలో ఆమె పర్యటిస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్‌పై వంగలపల్లిలో షర్మిల ప్రసంగించారు.

తెలంగాణ బడ్జెట్‌లో ప్రభుత్వ కేటాయింపులకు, చేస్తున్న ఖర్చుకు ఎక్కడా పొంతనలేదని షర్మిల అన్నారు. కాళేశ్వరం మినహా మిగతా ప్రాజెక్టులను గాలికొదిలేశారని ఆరోపించారు. పేదలకు గృహాలు, ఉద్యోగుల భర్తీ, రుణమాఫీతో పాటు కేసీఆర్‌ ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు.

మరోవైపు ఇప్పటికే బడ్జెట్‌పై కాంగ్రెస్, బీజేపీలు విమర్శలు గుప్పించాయి. రాష్ట్ర బడ్జెట్‌ అంతా డొల్ల.. ఎలక్షన్‌ స్టంట్‌ను తలపిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు. బడ్జెట్​లో అంతా శుష్క వాగ్దానాలు, శూన్య హస్తాలేనని ఆయన విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సహా అన్ని వర్గాలను పూర్తిగా వంచించేలా బడ్జెట్‌ను రూపొందించారని బండిసంజయ్​ ఆరోపించారు.

రాష్ట్ర బడ్జెట్ మేడిపండు, అంకెల గారడీ మాదిరిగా ఉందని కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. విద్యుత్​ను ఘనంగా ఇస్తున్నట్లు గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం.. మరి వ్యవసాయానికి ఐదు గంటలు కూడా కరెంట్ రావడం లేదని.. దానికి పట్టించుకుంటారా అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news