పోడు భూములపై కేబినెట్ భేటీలో సుదీర్ఘ చర్చ

-

రాష్ట్రంలో చాలా ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్య పోడు భూముల సమస్య. ఈ సమస్యపై పోడు రైతులు ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా అడపాదడపాగా స్పందించి చర్యలు తీసుకున్నా ఈ సమస్య ఇప్పటి వరకు ఓ కొలిక్కి రాలేదు. పోడు భూముల విషయంలో చాలా సార్లు అటవీ అధికారులకు, పోడు రైతులకు మధ్య ఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయి.

అయితే తాజాగా రాష్ట్ర కేబినెట్ ఈ విషయంపై దృష్టి సారించింది. రాష్ట్రంలో చాలాకాలంగా కొనసాగుతోన్న పోడు భూముల సమస్యపై మంత్రివర్గంలో ఇవాళ సుదీర్ఘంగా చర్చ జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గిరిజనులకు సంబంధించి వారు తమ అటవీ ప్రాంతంలో సాగు చేసుకుంటున్న పోడు భూములకు హక్కులు ఇవ్వాలని కోరుతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఎక్కడైతే పోడు భూముల సమస్య ఉందో ఆయా జిల్లాల వ్యాప్తంగా రెవెన్యూ, అటవీ, గిరిజన సంక్షేమశాఖల ఆధ్వర్యంలో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయించింది. సంబంధిత శాఖల సమక్షంలో జిల్లాలో పోడు భూములు సాగు చేసే వారు ఎంత మంది ఉన్నారు? ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు? అనే విషయాలను సమీక్షించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను కేబినెట్‌ ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news