తెలంగాణ రాజకీయాల్లో త్వరలో సంచలనం నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయా…? అంటే అవుననే సమాధానం వినబడుతోంది. ఫిబ్రవరి 17 న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మంత్రి కేటీఆర్ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయని, ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయని అంటున్నారు. ఈ మేరకు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అన్నట్లు ఆరోజు కేసీఆర్ పుట్టినరోజు కూడా.
అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, అలాగే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో గెలుపులో కేటీఆర్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలని పలువురు మంత్రులు, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కూడా అభిప్రాయపడుతూ వస్తున్నారు.
ఇటీవల మంత్రి గంగుల కమలాకర్ కూడా ఇదే విషయాన్ని ఒక కార్యక్రమంలో బయట పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ అడుగులు వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ ను తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రకటించిన తర్వాత కేసీఆర్… తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజ్యసభ సభ్యుడిగా దేశ రాజకీయాల్లోకి వెళ్లే అవకాశాలున్నాయని అంటున్నారు.
అలాగే, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నుంచి మాజీ ఎంపీ కవిత కు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారట కేసీఆర్. కేటీఆర్ పట్టాభిషేకం పూర్తయిన వెంటనే కేసీఆర్ రాజ్యసభ సభ్యుడిగా ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే ప్రయత్నాలు కూడా చేస్తారని అంటున్నారు. ఇటీవల ఆయన ఫెడరల్ ఫ్రంట్ గురించి కూడా ప్రస్తావించిన సంగతి తెలిసిందే. దీనిపై దృష్టి సారించాలని కేసీఆర్ భావిస్తున్నారు.