కాంట్రాక్టు లెక్చరర్లకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు

ఇచ్చిన మాటకు కట్టుబడి కాంట్రాక్టు లెక్చరర్లను… త్వరలోనే రెగ్యులరైజ్ చేస్తామని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు కీలక ప్రకటన చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల పీఆర్సీ ప్రకటించిన నేపథ్యంలో.. సిద్ధిపేట జిల్లా తెలంగాణ కాంట్రాక్టు లెక్చరర్స్ సంఘము ఆధ్వర్యంలో కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ… కాంట్రాక్టు లెక్చరర్లకు బేసిక్ పే ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించామని పేర్కొన్నారు.

గత ప్రభుత్వాలు కళాశాలలు మంజూరు చేసి పోస్టులను మరిచాయని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఇంటర్మీడియట్ లో ఉచిత విద్యను ప్రవేశ పెట్టారని.. ప్రభుత్వ లెక్చరర్లతో సమానంగా కాంట్రాక్టు లెక్చరర్లకు పీఆర్సీతో సమానంగా వేతనాలు ఇస్తున్నామని గుర్తు చేశారు. ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ ఉద్యోగులుగా ఉండాలన్నదే తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశ్యమని వెల్లడించారు. మొదటి వారంలోనే కాంట్రాక్టు లెక్చరర్లకు వేతనాలు అందేలా చూస్తామని.. కరోనా తో మృతి చెందిన కాంట్రాక్టు లెక్చరర్లకు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు మంత్రి హరీష్‌ రావు.