మొన్నటి దాకా కేంద్రం ప్రవేశ పెడుతున్న చాలా పధకాలు అంత బాగా లేవని, రాజకీయంగా విమర్శలు చేస్తూ వస్తున్న కేసీఆర్ ఇప్పుడు వరుసగా కేంద్ర పధకాలకు తన మద్దతు తెలుపుతూ వస్తున్నారు. మొన్నటికి మొన్న నూతన వ్యవసాయ చట్టాలకు తన మద్దతు తెలుపగా ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ లో చేరుతున్నట్టు ప్రకటించారు. భారత ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశ్రీ పథకాన్ని డొవెటైల్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వెల్లడించారు.
నిన్న బి.ఆర్.కె.ఆర్. భవన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు. ప్రధాని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆయుష్మాన్ భారత్ , ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన , జల్ జీవన్ మిషన్ పథకాల మౌలిక సదుపాయాల పురోగతిని సమీక్షించారు. ఈ సంధర్భంగా ఆరోగ్య శ్రీ తో పాటు ఆయుస్మాన్ భారత్ ని తెలంగాణ లో అమలు చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని ప్రధానికి సీఎస్ తెలిపారు.