‘డీఎంకే తనను అగ్నిపర్వతం అని చెప్పుకొంటోంది. కానీ అది హిమాలయాలను ఏమీ చేయలేదు. ఏం చూసినా భయపడేవాళ్లే గవర్నర్లను విమర్శిస్తున్నారు. సీరియళ్లు, సినిమాల్లో నటించి పదవుల్లోకి వచ్చినవారికే కెమెరా, మైక్ మేనియాలు ఉంటాయి. నిజాలు మాట్లాడే మాకు ఉండవు. వారికి మైక్ మేనియా అనే కంటే మోదీ ఫోబియా ఎక్కువగా ఉంది’. అని గవర్నర్ తమిళిసై విమర్శించారు.
తెలుగు మూలాలు ఉండి, ఇంట్లో ఆ భాష మాట్లాడుతూ బయట తమిళ వేషం వేసేవారు తనలా నిజమైన తమిళ రక్తం ప్రవహించే వారి వైఖరిని జీర్ణించుకోలేకపోతున్నారని తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై వ్యాఖ్యానించారు. తమిళనాడుపై అభిప్రాయాలు వ్యక్తం చేయొద్దని చెప్పేందుకు వారు ఎవరని ప్రశ్నించారు. కొందరికి మైక్ మేనియా ఉందని, తెలంగాణలో గొప్పలు చెప్పేందుకు వీలుకాక తమిళనాడును విమర్శిస్తున్నారంటూ.. తమిళిసైని ఉద్దేశించి వ్యాఖ్యానిస్తూ డీఎంకే అధికారిక పత్రిక ‘మురసొలి’లో ఓ వ్యాసం ప్రచురితమైంది. దీనికి స్పందిస్తూ తమిళిసై తాజాగా ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. తెలంగాణ పత్రికల్లో వచ్చే వార్తలు చూస్తే ఎవరు వణుకుతున్నారో అర్థమవుతోందని పేర్కొన్నారు. తమిళనాడులో వారసత్వ రాజకీయ ప్రభుత్వాన్ని ప్రజల ముందు నిలదీస్తున్నందునే గవర్నర్ రవిపై అధికార పార్టీ నేతలకు కోపమని పేర్కొన్నారు.