ఇంటర్ సిలబస్ తగ్గింపు విషయంలో తెలంగాణా ప్రభుత్వం వెనకడుగు వేసినట్టు సమాచారం అందుతోంది. ప్రముఖుల జీవిత చరిత్ర లకు సంబంధించిన పాఠాలను సిలబస్ నుంచి తొలగించాలనే నిర్ణయాన్ని విమర్శలు రావడంతో వెనక్కు తీసుకున్నట్టు చెబుతున్నారు. తాజాగా ఈ మేరకు ఇంటర్ బోర్డు కు స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రా రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేసినట్టు సమాచారం. ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన పాఠాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించరాదు అని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కు విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి చిత్రా రామచంద్రన్ సీరియస్ నోట్ పంపినట్టు చెబుతున్నారు. కరోనా పరిస్థితులతో తరగతులు ఆలస్యంగా ప్రారంభం కానున్న వేళ తెలంగాణ ఇంటర్ బోర్డు కేంద్రం, సీబీఎస్‌ఈ సూచనల మేరకు పాఠ్యాంశాలను కుదించింది.
ఈ మేరకు సిలబస్‌లో 30 శాతం కుదిస్తున్నట్లు ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కుదించిన సిలబస్ ప్రకారమే వార్షిక, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ప్రశ్నలు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. అయితే తొలగించిన సిలబస్ లో అందులో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్, జ్యోతిబా పూలే, పెరియార్ రామస్వామి, నారాయణగురు వంటి వారి చరిత్రను తొలగించటం వివాదాస్పదంగా మారింది. వీటితో పాటు గాంధీయిజం, సోషలిజం, కమ్యూనిజం, బుద్ధుని బోధనలు, ఆర్టీఐ తదితర కీలక అంశాలనూ ఇంటర్ సిలబస్ నుంచి తొలగించడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో వెనక్కు తగ్గిన సర్కార్ ఆ ఉత్తర్వులని వెనక్కు తీసుకుంది. మరో మారు చర్చించి సిలబస్ కుదించే అవకాశం కనిపిస్తోంది.