తెలంగాణను విభజించేందుకే అమిత్ షా వచ్చారు : కేటీఆర్

-

కేంద్ర మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. 74 ఏళ్ల క్రితం ఆనాటి కేంద్ర హోం మంత్రి తెలంగాణను భారత్‌లో కలిపితే.. నేటి హోం మినిస్టర్ మాత్రం తెలంగాణను విభజించి బెదిరించేందుకు వచ్చారని మండిపడ్డారు. దేశానికి కావాల్సింది విభజన రాజకీయాలు కాదని స్పష్టం చేశారు. నిర్ణయాత్మక విధానాలే ప్రస్తుతం దేశానికి కావాల్సినవని అన్నారు.

మరోవైపు సిరిసిల్లలో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్చ పొందడానికి ఆనాటి యావత్ సమాజం ఉద్యమించిందని అన్నారు. ఆనాటి అపూర్వ ఘట్టాలు జాతి జీవనంలో నిరంతరం సజీవంగా నిలుస్తాయని ఉద్ఘాటించారు. జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా సిరిసిల్ల కలెక్టరేట్‌లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులను వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబుతో కలిసి సన్మానించారు.

ఆనాటి ఉద్యమానికి నాయకత్వం వహించిన ఆదివాసి యోధుడు కుమురంభీం, తన అమరత్వంతో చరిత్రను వెలిగించిన దొడ్డి కొమురయ్యలతో పాటు నాటి పోరాటానికి నాయకత్వం వహించిన మహానీయులు రావి నారాయణరెడ్డి, స్వామి రామానంద తీర్ధ, భీంరెడ్డి నర్సింహారెడ్డి, వీరవనిత చాకలి ఐలమ్మ వంటి ప్రజానేతల త్యాగాలను స్మరించుకొందామని కేటీఆర్ గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news