బంజరాహిల్స్ లోనూ బంజారాలకు చోటు కల్పించాం : కేసీఆర్

-

బంజారా, ఆదివాసీ బిడ్డలు తలెత్తుకునేలా భవనాలు నిర్మించుకున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివాసీ, బంజారా హక్కుల పరిరక్షణ వేదికలుగా ఉండాలని భావించారు. ఈ భవనాల వేదికగా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. గిరిజనుల ఆత్మగౌరవ భవనాలను సీఎం కేసీఆర్‌ ప్రజలకు అంకితం చేశారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో సకలహంగులతో నిర్మించిన సేవాలాల్ బంజారా భవన్, కుమురంభీం ఆదివాసీ భవన్‌లను ముఖ్యమంత్రి లాంఛనంగా శ్రీకారం చుట్టారు.

ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని బంజారాలు, ఆదివాసీలకు కేసీఆర్ భరోసానిచ్చారు. విద్య, పోడు భూముల విషయంలో కొంత పురోగమించామని తెలిపారు. బంజారా, ఆదివాసీల సమస్యలు ఇంకా పరిష్కారం కావాల్సి ఉందని అన్నారు.

“హైదరాబాద్‌లో బంజారాహిల్స్ అనే పెద్ద ప్రాంతం ఉంది కానీ అక్కడ బంజారాలకు చోటు లేదు. మహారాష్ట్రలో బంజారాలు బీసీల జాబితాలో ఉన్నారు. దేశవ్యాప్త బంజారాలకు ఒకే స్థాయి రిజర్వేషన్లు ఉండాలి. తెరాస జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాక ఏకీకృత విధానం తెస్తాం. త్వరలో పోడుభూముల సమస్య పరిష్కరించనున్నాం. ఉన్నత స్థానాల్లో ఉన్న గిరిజనులు తండాల్లో సమస్యల పరిష్కరానికి కృషి చేయాలి. బంజారా, ఆదివాసీలు తలెత్తుకునేలా భవనాలు నిర్మించాం. బంజారాలకు ఏ కష్టమొచ్చినా ఈ భవనం నుంచి ఆదుకోవాలి. ఆదివాసీ, బంజారా హక్కుల పరిరక్షణ వేదికలుగా ఉండాలి.” అని సీఎం కేసీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news