మహా పీఠం మీద మోడీకి నచ్చనోడు…?

-

మహారాష్ట్ర రాజకీయం మలుపులు తిరుగుతోంది. స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి. అధికార పంపిణీ విషయంలో బీజేపీ.. శివసేన మధ్య నెలకొన్న విభేదాలు ఒక కొలిక్కి రాకపోవటంతో ఇబ్బందికరంగా మారింది. అదే సమయంలో కాంగ్రెస్.. ఎన్సీపీలతో జత కట్టేందుకు శివసేన సిద్ధంగా లేకపోవటంతో సంచలన పరిణామాలకు అవకాశం లేకుండా పోయింది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ శివసేనతో రాజీ కుదుర్చుకోవటం.. అదే సమయంలో శివసేన బీజేపీకి తలొగ్గక తప్పని స్థితి.

నిబంధనల ప్రకారం ఈ నెల తొమ్మిది (శనివారం) నాటికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి. ప్రభుత్వ ఏర్పాటులో నిన్నటి వరకూ నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్న బీజేపీ.. ఇప్పుడిప్పుడే తన వ్యూహాన్ని మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. అదే సమయంలో తాము బెట్టు చేసి ప్రభుత్వ ఏర్పాటుకు దూరంగా ఉన్న పక్షంలో.. మళ్లీ ఎన్నికలు వస్తే తమకు వచ్చిన మెజార్టీలో మార్పు రావటం ఖాయమని.. అదే జరిగితే రాజకీయంగా తమకుజరిగే నష్టం ఎక్కువన్న ఆలోచనలో శివసేన ఉంది. ఈ కారణంగా బీజేపీతో సంధికి సై అనే పరిస్థితి. కాకుంటే.. తమ పట్ల అహంకారంతో వ్యవహరించారని భావిస్తున్న దేవేంద్ర ఫడ్నవీస్ కు సీఎం కుర్చీ దక్కకూడదన్న పట్టుదలతో సేన ఉన్నట్లు చెబుతున్నారు.

ముందు నుంచి కోరుతున్నట్లు తమకు సీఎం కుర్చీ ఇవ్వకున్నా ఫర్లేదు.. ఫడ్నీవీస్ ను మాత్రం ముఖ్యమంత్రిని చేయొద్దన్న మాట మీద శివసేన బలంగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య సంధి కుదిర్చేందుకు రంగంలోకి దిగిన సంఘ్.. రాజీ అభ్యర్థిని తెర మీదకు తెచ్చినట్లుగా తెలుస్తోంది. మోడీ పెద్దగా మక్కువ చూపని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రకటించాలన్న మాటను తన మాటగా సంఘ్ ఫైనల్ చేసినట్లుగా సమాచారం.

సంఘ్ ముద్దుబిడ్డగా మంచి పేరున్న గడ్కరీ ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తే శివసేన సైతం ఓకే చెబుతుందని చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గడ్కరీ సీఎం అయితే.. మహా ప్రభుత్వం సాఫీగా నడిచే వీలుందన్న మాట వినిపిస్తోంది. అయితే.. మోడీకి సన్నిహితుడైన ఫడ్నవీస్ ను పక్కన పెట్టి.. సంఘ్ ముద్దుబిడ్డ గడ్కరీని మహా పీఠం మీద కూర్చోబెట్టటానికి మోడీషాలు ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news