తెలంగాణ ప్రతిపక్షాలు మీటింగ్ పెట్టాయి… మరి బాధ్యత?

-

ఏపీలోనే అనుకుంటే.. మెల్లమెల్లగా తెలంగాణలో కూడా కరోనా రాజకీయాలు మొదలైపోతున్నాయి! ఇంతకాలం ఏపీలో టీడీపీ – జనసేనలు.. కరోనా పేరుచెప్పి ఏ రాష్ట్ర ప్రతిపక్షాలూ చేయనంత రాజకీయ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణలో ప్రతిపక్షాలు మాత్రం అలా లేవులే… ఇలాంటప్పుడు కూడా రాజకీయాలు ఎందుకని సైలంటుగా ఉన్నాయి అనుకుంటున్న దశలో… వారు కూడా తాజాగా కరోనా సమయంలో రాజకీయానికి తెరలేపారు… ప్రభుత్వంపై ఆరోపణలు, డిమాండ్ లు చేసేస్తున్నారు.

వివరాళ్లోకి వెళ్తే… హైదరాబాద్ లోని తెలంగాణ జన సమితి(తెజస) రాష్ట్ర కార్యాలయంలో కోదండరాం అధ్యక్షతన విపక్షాలన్నీ మీటింగు పెట్టుకున్నాయి! ఈ సమయంలో మీటింగ్ దేనికబ్బా అనుకునేరు… తెలంగాణలో మద్యం అమ్మకాలు ఓపెన్ చేసినందుకు తెలంగాణ ముఖ్యమంత్రిపై విరుచుకుపడటానికి! రాష్ట్రాలకు సరిపడా ఎలాంటి సాయం చేయకుండా.. మద్యం దుకాణాల ఓపెనింగ్ కి మాత్రం అనుమతి ఇచ్చి చేతులు దులుపుకున్న కేంద్రాన్ని కదా అంతా ఐకమత్యంగా తప్పుపట్టాలి? కానీ… ఏపీ, తెలంగాణలో ప్రతిపక్షాలకు ఆ ధైర్యం కానీ, అలాంటి ఆలోచన కానీ చేసే ఉద్దేశ్యం లేదు! పోనీ ఏపీలో టీడీపీ – జనసేనలకు మోడీ అంటే భయమనుకుందా… తెలంగాణలో కాంగ్రెస్ కి ఏమైంది? వారికే తెలియాలి!!

ఆ సంగతి అలా ఉంచితే… వివిధ పార్టీల నాయకులు ఈ మీటింగ్ లో… మద్యం అమ్మకాలతో తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరిగితే ముఖ్యమంత్రి కేసీఆరే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. మద్యపానం కారణంగా గృహహింస, అత్యాచారాలు పెరిగితే సీఎం కేసీఆరే బాధ్యత వహించాలని కూడా అన్నారు. కరోనా పాజిటివ్ కేసులపై అనుమానాల నివృత్తికి ఏకంగా శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా డిమాండ్ చేశారు! ప్రతిపక్షాలు ఏం చేయాలన్నా లాక్ డౌన్ నిబంధనలు గుర్తొస్తాయని, అధికార పార్టీకి మాత్రం అవి వర్తించవని డిఫరెంట్ లాజిక్ కూడా లాగారు! ఈ సమయంలో అన్ని పక్షాలకూ లాక్ డౌన్ ఉంటాది కానీ… అధికారపక్షం కూడా లక్ డౌన్ అని ఇంట్లో కూర్చుంటుందా? ప్రజలను, పాలనను గాలికి వదిలేస్తుందా? అర్ధం లేని వాదన కాకపోతేనూ!

ఇక్కడ ఇంకో డిమాండ్ కూడా చేశారూ ఈ మీటింగ్ లోని పెద్దలు… అదేమిటయ్యా అంటే… ఈ నెల 11లోగా భవన నిర్మాణ కార్మికులకు రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం అందజేయాలని, అలా కానిపక్షంలో 12వ తేదీన లేబర్ ఆఫీస్ ముందు ధర్నా కూడా చేపడతామని! ఇదే క్రమంలో… రైతురాజ్యం ముసుగులో ముఖ్యమంత్రి కేసీఆర్ రాచరిక పాలన సాగిస్తున్నారని విమర్శించారు! ఈ కార్యక్రమంలో కోదండ రాం, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ , టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు. విచిత్రం ఏమిటంటే… వీరిలో ఎవరూ… కేంద్రం నుంచి తమ రాష్ట్రానికి ఈ పరిస్థితుల్లో రావాల్సిన సాయం ఏ స్థాయిలో ఉండాలి అనే విషయంపై మాత్రం కేంద్రాన్ని ఎలాంటి డిమాండ్ చేయకపోవడం!! ప్రతిపక్ష బాధ్యత అంటే… అధికారపక్షం ఏమి చేసినా తప్పుపట్టడం మాత్రమే కాదు కదా! కేంద్రం నుంచి ఇలాంటి సమయంలో రావాల్సిన సాయంపై.. అధికారపక్షంతో కలిసి పోరాటం సంగతి కాసేపు పక్కనపెడితే, కనీసం డిమాండ్ అయినా చేయాలి కదా!!

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version