పోలవరం ప్రాజెక్టు కారణంగా తెలంగాణ పై పడే ప్రభావాన్ని అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఐఐటీ హైదరాబాద్ బృందంతో అధ్యయనం చేయాలని ఆయన ఆదేశించడంతో.. 2022లో వచ్చిన వరదల కారణంగా భద్రాచలం ముంపుకు గురైందని, 27 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చిందని అధికారులు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు.
ఏపీ ప్రభుత్వం కొత్తగా బనకచర్ల ప్రాజెక్టు చేపడుతోందని.. ఈ ప్రాజెక్టుకి ఎలాంటి అనుమతులు లేవని అధికారులు సీఎం రేవంత్ కి వివరించారు. తెలంగాణ అభ్యంతరాలను ఏపీ సీఎస్ కి తెలపాలని, అవసరమైతే గోదావరి బోర్డు, కేంద్ర జల శక్తి శాఖకు లేఖలు రాయాలని సీఎం రేవంత్ సూచించారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ సర్కార్ ఝలక్ ఇచ్చింది.
పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. పోలవరం వల్ల భద్రాచలం ముంపుకు గురవుతున్నట్లు ఆరోపించింది. ఈ మేరకు కేంద్రం, ఏపీ, గోదావరి బోర్డుకి తెలంగాణ సర్కార్ లేఖలు రాసింది. నీటి వాటాలు తేలేవరకు బనకచర్ల పనులు ఆపివేయాలని డిమాండ్ చేసింది.