తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కి సవాల్ విసిరారు. తాజాగా గాంధీ భవన్ లో జరిగిన ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో బిల్లు తెస్తామని.. ఈ బిల్లును 9వ షెడ్యూల్ లో పెట్టించే దమ్ముందా..? అని బండి సంజయ్ ని ప్రశ్నించారు. ముఖ్యంగా కులగణన పై బీజేపీ, బీఆర్ఎస్ ఏదోక వివాదం సృష్టించాలని చూస్తున్నాయని ఆయన మండిపడ్డారు.
ఈ బిల్లు గురించి మాట్లాడుతున్న బండి సంజయ్ సహ పలువురు బీజేపీ నేతలు దమ్ముంటే ప్రధాని మోడీని ఒప్పించి ఈ బిల్లును 9వ షెడ్యూల్ లో పెట్టండి అంటూ సవాల్ విసిరారు. అదే విధంగా కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన చేపట్టేలా మీరు మోడీతో మాట్లాడగలరా అంటూ నిలదీశారు. దేశవ్యాప్త కులగణన విషయాన్ని పక్కదారి పట్టించేందుకు బీజేపీ నేతలు రాహుల్ గాంధీ కులం, మతం అంశం నెత్తికి ఎత్తుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. బీసీల్లో ఐక్యం లోపించిందనీ.. బీసీల రిజర్వేషన్ల బిల్లుపై బీసీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.