హైదరాబాద్‌లో ఇవాళ తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని కుల్సుంపుర జియాగూడ పరిధిలోని వెంకటేశ్వరనగర్‌లో ఉన్న ఫర్నిచర్ తయారీ గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. భవనంలోని మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు వ్యాపించి విస్తరించాయి. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది పది ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పివేశారు.
ప్రమాదం జరిగిన సమయంలో గోదాంలో 20 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారిని సురక్షితంగా నిచ్చెన ద్వారా కిందకు తీసుకువచ్చారు. వారిలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెప్పినట్లు సమాచారం. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు అగ్నిమాపక శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.