బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ప్రస్తుతం తిహాడ్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై మరోసారి ఆ పార్టీ అధినేత, కవిత తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. రాజకీయ కక్షతోనే తన కూతురును జైల్లో పెట్టారని అన్నారు. సొంత బిడ్డ జైళ్లో ఉంటే కన్నతండ్రిగా బాధ ఉండదా అని ప్రశ్నించారు.
‘నేను నిగ్రహంతో అగ్ని పర్వతంలా ఉన్నాను. అందరూ అంటున్నట్లు పార్టీకి క్లిష్ట పరిస్థితులు ఏమీ లేవు. ఇంతకన్నా ఇబ్బందికర పరిస్థితుల్లో నేను తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాను. నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదా? కచ్చితంగా బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుంది. కొత్త ప్రభుత్వానికి ఐదారు నెలల సమయం ఇవ్వాలని నేను భావించాను. రాష్ట్ర ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ పూర్తయింది. ఇంకో నాలుగు నెలలు అయితే బండారం పూర్తిగా బయటపడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి కూడా పట్టు సాధించలేకపోయింది. పాలనపై దృష్టి పెట్టకుండా బదనాం చేసే పనిలోనే ఉన్నారు.’ అని కేసీఆర్ రేవంత్ సర్కార్‌పై ధ్వజమెత్తారు.