ఐఐటీ హైదరాబాద్ తో కేంద్ర బొగ్గుగనులశాఖ ఒప్పందం కుదుర్చుకున్నది. శుక్రవారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో ఎంవోయూ కుదుర్చుకున్నారు. గనులశాఖలో రీసెర్చ్, డెవలప్మెంట్ కోసం ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అత్యాధునిక సాంకేతికత ఉపయోగానికి సహకారం ఉంటుందని అన్నారు. ఐఐటీ హైదరాబాద్ కి రూ.98 కోట్లు కేటాయిస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. దేశంలో బొగ్గు ఉత్పత్తి రోజురోజుకు పెరుగుతోందని అన్నారు. ప్రపంచంలోనే బొగ్గు ఉత్పత్తిలో భారత్ ది రెండోస్థానంలో కొనసాగుతోందని చెప్పారు. బొగ్గు ఉత్పత్తి ద్వారా అనేక రాష్ట్రాలకు భారీగా ఆదాయం సమకూరుతోందని అన్నారు.
రైల్వేలకు 50 శాతం ఆదాయం బొగ్గురవాణాతోనే వస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. అంతకుముందు మరో కార్యక్రమంలో మాట్లాడుతూ.. మైనింగ్ రంగంలో మహిళలకు ప్రాధాన్యం కల్పించే దిశగా చర్యలు చేపడతామని అన్నారు. పురుషాధిక్య పరిశ్రమల్లో మహిళలకు సమాన అవకాశాలను సృష్టించడానికి మరిన్ని చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. మైనింగ్ంగంలో మహిళల విలువైన సహకారాలను గుర్తిస్తున్నామని అన్నారు. మైనింగ్ లో మహిళా నిపుణులకు అనుకూల వాతావరణాన్ని సృష్టించటానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.