హైదరాబాద్ నగరంలోని శివారు నియోజకవర్గమైన ఎల్బీనగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని బీజేపీ చంపాపేట డివిజన్ కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి అసభ్య పదజాలంతో దూషించడంతో వివాదం తలెత్తింది. ఎల్బీనగర్ నియోజకవర్గంలో మరోసారి ప్రోటోకాల్ వివాదం బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల మధ్య చిచ్చు రాజేసింది. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, బీజేపీ కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. మధుసూదన్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ కార్యకర్తలు కార్పొరేటర్ ఇంటిని ముట్టడించారు.
ఇరు పార్టీల నేతలు పరస్పరం దూషించుకోవడంతో పాటు గొడవకు దిగారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. మరోవైపు బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.