రాష్ట్రంలో పలువురు ఆధార్ కార్డుల పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆన్‌లైన్‌లో కార్డులు డీయాక్టివేట్ అయినట్లు కనిపిస్తుండడంతో ఆందోళనకు గురవుతున్నారు. వాటిని తిరిగి యాక్టివేట్ చేయించుకునే ప్రక్రియ గందరగోళంగా తయారైంది. సాంకేతిక సమస్యలు, ఇతరత్రా కారణాలతో ఇవి డీయాక్టివేట్ అవుతున్నట్లు సమాచారం. ఆధార్ కార్డు జారీ అయి పదేళ్లు దాటితే అప్‌డేట్ చేసుకోవాలని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఆధార్ కేంద్రాలకు వెళ్లినప్పుడు, ఆస్తుల రిజిస్ట్రేషన్ తదితర సందర్భాల్లో ఇవి బయటపడుతున్నాయి. ఇంతకీ ఇలా జరగడానికి కారణాలేంటంటే..
ఆధార్ కార్డుల జారీ సమయంలో పలువురు నిర్దిష్ట వయసు పేర్కొనకుండానే వివరాలు నమోదు చేసుకోవడంతో వయసు, ఇతరత్రా సవరణల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఆధార్ కార్డులు డీయాక్టివేట్ అవుతున్నాయి.
ఆధార్‌కార్డుల జారీ సమయంలో కొందరు పిల్లల వేలి ముద్రల బదులు వారివి ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో ఆధార్‌ను అప్‌డేట్ చేసుకుంటున్న సమయంలో వేలిముద్రలు సరిపోక కార్డులు డీయాక్టివేట్ అవుతున్నాయి.
ఆధార్ రీజినల్ కేంద్రంలో దరఖాస్తు చేసుకుంటే పుట్టిన తేదీ ధ్రువీకరణ, ఇతరత్రా పత్రాల నిర్ధారణకు అది తహసీల్దార్ లాగిన్‌కు అర్జీలను పంపుతుంది. పనిఒత్తిడి, ఇతర కారణాలతో చాలాచోట్ల రెవెన్యూ అధికారులు ఆధార్ లాగిన్ తెరిచి వెరిఫికేషన్ చేయట్లేదు. ఏళ్ల నుంచి తహసీల్దార్ లాగిన్‌లలో అవి పెండింగ్‌లో ఉన్నాయి.