వ్యవసాయానికి మూడు గంటల కరెంటు సరిపోతుందని చెబుతున్న కాంగ్రెస్ నేతలను శిక్షించాలని బీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు. రైతులకు 24 గంటల విద్యుత్ ను సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు.వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ సరిపోతుందని కాంగ్రెస్ ను బంగాళాఖాతంలో కలపాలన్నారు.
జనగామలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. అన్న చెప్పాడనో, బావ చెప్పాడనో ఓటు వేయవద్దన్నారు. ఓటు వేసే సమయంలో జాగ్రత్తగా ఆలోచించాలని ఆయన కోరారు. ఒక్కసారి తప్పుగా ఓటు వేస్తే నష్టపోతామన్నారు.జనగామ, భువనగిరిలు గ్రోత్ కారిడార్ లుగా మారాయన్నారు. జనగామ అసెంబ్లీ స్థానం నుండి పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపిస్తే చేర్యాలను రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. పాత వరంగల్ జిల్లాలో అత్యధికంగా వరి పండించే తాలుకా జనగామ అని కేసీఆర్ చెప్పారు. ఎన్నికలు రాగానే నోటికి వచ్చినట్టుగా మాట్లాడి వెళ్లిపోతారన్నారు.ఎన్నికలప్పుడు వచ్చి ఆపద మొక్కులు మెుక్కే వారిని నమ్మొద్దని ఆయన ప్రజలకు సూచించారు. ఎన్నికల సమయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన ప్రజలను కోరారు.