ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన హైదరాబాద్ విద్యార్థి కిడ్నాప్ అవ్వడం ఇప్పుడు కలకలం రేపుతోంది. డ్రగ్ మాఫియాకు చెందిన కొందరు ఈ విషయాన్ని హైదరాబాద్ నగరం నాచారంలోని తల్లిదండ్రులకు ఫోన్ చేసి బెదిరించారు. తమకు అమెరికా డాలర్ల రూపంలో డబ్బు పంపిస్తే వదిలేస్తామని, లేకపోతే కిడ్నీలు అమ్మేస్తామని బెదిరించినట్లు సమాచారం.
ఈనెల 8న అబ్దుల్ అదృశ్యమయ్యాడని అమెరికాలో చదివే అతడి స్నేహితుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టడం చూసిన అతడి సోదరి చూసి తల్లిదండ్రులకు చెప్పగా వారు అబ్దుల్‌కు ఫోన్ చేశారు. అయినా స్పందన లేకపోవడంతో 9న ఎంబీటీ నేత అమ్జద్ ఉల్లా ఖాన్ సాయంతో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌కు లేఖ రాశారు. వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయానికి సమాచారమిచ్చి తమ కుమారుడి ఆచూకీ కనిపెట్టాలని కోరారు. చివరిసారి 8న క్లీవ్‌లాండ్‌లోని వాల్‌మార్ట్ స్టోర్‌లో కనిపించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డైనట్లు అక్కడి పోలీసులు సమాచారమిచ్చారు. రోజులు గడుస్తున్నా ఆచూకీ లేకపోవడంతో తండ్రి 18న మరోమారు కేంద్ర విదేశాంగ శాఖను, అమెరికాలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు.