తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ ఆరాటపడుతోంది. ఎలాగైనా తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగురవేయాలని ఇప్పట్నుంచే పావులు కదుపుతోంది. ఇప్పటికే ప్రజాసంగ్రామ యాత్ర, మహాజన్సంపర్క్ యాత్రల పేరిట ప్రజల్లోకి వెళ్తోంది. ఇక జాతీయ నేతలను కూడా రాష్ట్రానికి రప్పిస్తూ.. ప్రజల్లో పార్టీపై విశ్వాసాన్ని నెలకొల్పేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందులో భాగంగానే ఇవాళ రాష్ట్రానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రానున్నారు.
ఇవాళ రాత్రి 11:55 గంటలకు అమిత్ షా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి ఆయన నోవాటెల్ హోటల్‌కు చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. ఇక రేపు ఉదయం 10 గంటలకు బీజేపీ ముఖ్యనేతలతో షా భేటీ అవుతారు. అనంతరం దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, వేమూరి రాధాకృష్ణ వంటి ప్రముఖులతో సమావేశమవుతారు. వారితో కాసేపు ముచ్చటించిన తర్వాత మధ్యాహ్నం 12.45 గంటలకు శంషాబాద్‌లో కార్యకర్తలతో సమావేశం అవుతారు. అనంతరం 2.25 గంటలకు హెలికాప్టర్లో భద్రాచలానికి పయనమై రాముల వారిని దర్శించుకుంటారు. ఇక సాయంత్రం ఖమ్మం సభలో పాల్గొని తిరిగి దిల్లీకి పయనమవుతారు.