పార్లమెంట్ ఎన్నికల ముంగిట తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. లోక్సభ ఎన్నికల ముందు జరగనున్న ఈ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మహిళలకు వడ్డీ లేని రుణ పథకం పునరుద్ధరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.
మరోవైపు నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతలకు కేబినెట్ ఆమోదం తెలపనున్నన్నట్లు సమాచారం. అలాగే కాళేశ్వరంపై జ్యుడిషియల్ విచారణపై చర్చించనున్నారు. రైతుభరోసా పథకం మార్పులు చేర్పుల గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది. కొత్త కార్పొరేషన్లు ఏర్పాటుపై ఇవాళ్టి కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ఆమిర్ అలీఖాన్‌ల పేర్లను మరోసారి గవర్నర్ కోటా నామినేటెడ్ ఎమ్మెల్సీల కోసం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు మరోసారి పంపే అవకాశంపై ఓ నిర్ణయానికి రానున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డీఏలపై సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రభత్వ వర్గాల సమాచారం.