రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీలు సంసిద్ధమవుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ తన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇక కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్థుల ఎంపికలో బిజీ అయ్యారు. ముఖ్యంగా కాంగ్రెస్ ఇప్పటికే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. వాటిని వడపోసి అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. దశల వారీగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఎంపిక పూర్తయి.. అధిష్ఠానం నిర్ణయించే వరకు అభ్యర్థులెవరూ తమకే టికెట్ వచ్చిందన్నట్లు చెప్పుకోకూడదని ఇప్పటికే పార్టీ హైకమాండ్ స్పష్టం చేసింది.
అయితే తాజాగా టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ మాత్రం తాను ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. నియోజకవర్గ పరిధిలోని కవాడిగూడ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. చాలా మంది నాయకులు, ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీని వీడినా.. తాను మాత్రం పార్టీతోనే ఉంటూ ప్రజాసేవ చేస్తున్నానని వెల్లడించారు. ముషీరాబాద్ నుంచి హేమాహేమీలు బరిలోకి దిగుతున్నారని.. అందుకే పార్టీ అధిష్ఠానం తనను బరిలోకి దించాలని నిర్ణయించినట్లు ఆయన వివరించారు.