తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై సొంత పార్టీ నేతల నుంచే కాంగ్రెస్ కు తిరుగుబాటు ఎదురవుతోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో అధిష్ఠానం తీరుతో పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వం, పార్టీ అధిష్ఠానానికి వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎగురవేశారు.
కేబినెట్ విస్తరణ అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రెడ్డి సామాజిక వర్గ మంత్రులకు కాంగ్రెస్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అభిమానులు హెచ్చరిక జారీ చేశారు. మంత్రివర్గ విస్తరణ చేయడం లేదంటూ పలువురు నాయకులు తమకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతున్నారని ఆయన ఫ్యాన్స్ ఓ లేఖ విడుదల చేశారు. ఎమ్మెల్యే టికెట్ కోసం రూ.10 కోట్లు ఇచ్చామని, మంత్రి పదవి కోసం రూ.100 కోట్లు ఖర్చు పెట్టామని.. తీరా మంత్రి పదవి వచ్చే సమయానికి అడ్డుపడుతున్నారు అంటూ రేవంత్ రెడ్డి, రెడ్డి నాయకులను దూషిస్తూ వాకిటి శ్రీహరి అభిమానులు, ముదిరాజ్ సంఘం నాయకులు రాసిన లేఖ నెట్టింట వైరల్ అవుతోంది. రేవంత్ రెడ్డి, ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి మంత్రి పదవి రాకుండా చేస్తే నీ భరతం పడతామంటూ లేఖలో బెదిరించారు.