ఏపీ, తెలంగాణ తనకు రెండు కళ్లు అని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. నాలుగోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు తొలిసారి వచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. ఏపీలో విజయానికి తెలంగాణ టీడీపీ శ్రేణులు పరోక్షంగా కృషి చేశారని అన్నారు.
‘‘ఆత్మీయులను కలిసి అభినందనలు తెలియజేయాలని వచ్చాను. మీ అభిమానం చూస్తుంటే నాకు ఉత్సాహం వస్తుంది. ఏపీలో విజయానికి తెలంగాణ తెదేపా శ్రేణులు పరోక్షంగా కృషి చేశారు. వారందరికీ ధన్యవాదాలు. నన్ను జైల్లో పెట్టినపుడు తెదేపా శ్రేణులు చూపించిన చొరవ మరువలేను. ప్రపంచంలోని చాలా దేశాల్లో నా అరెస్ట్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. ఆ సమయంలో గచ్చిబౌలిలో నిర్వహించిన సభను నేను మరిచిపోలేను. హైదరాబాద్‌లో నాకు మద్దతుగా నిర్వహించిన ఆందోళనలను టీవీలో చూసి గర్వపడ్డాను. తెలంగాణలో అధికారంలో లేకున్నా కార్యకర్తలు పార్టీ వదల్లేదు. పార్టీ నుంచి నాయకులు తప్ప కార్యకర్తలు వెళ్లలేదు. తెలుగుజాతి ఉన్నంతవరకు టీడీపీ జెండా రెపరెపలాడుతుంది. సంక్షోభాన్ని అవకాశంగా మలచుకుని మళ్లీ అధికారంలోకి వచ్చాం. ’’ అని చంద్రబాబు అన్నారు.