నాలుగోసారి ప్రమాణం చేశాక తొలిసారిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర టీడీపీ నేతలు ఆయనకు ఘనంగా సన్మానం చేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత తొలిసారిగా ఇక్కడికి వచ్చానని అన్నారు. ఆత్మీయులను కలిసి అభినందనలు తెలియజేయాలని వచ్చానని తెలిపారు. ఈ అభిమానం చూస్తుంటే తనకు ఉత్సాహం వస్తుందని చెప్పారు.
“తెలంగాణ టీడీపీ శ్రేణులు ఏపీలో నా విజయానికి పరోక్షంగా కృషి చేశారు. టీటీడీపీ శ్రేణులకు ధన్యవాదాలు. తెలంగాణ గడ్డపైన టీడీపీ పార్టీకి మళ్లీ పునర్‌వైభవం వస్తుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు నా రెండు కళ్లు. ఎన్టీఆర్ అనేక పరిపాలన సంస్కరణలు తీసుకొచ్చారు. సంక్షేమానికి నాంది పలికిన నాయకుడు ఎన్టీఆర్. తెలంగాణలో అధికారంలో లేకున్నా కార్యకర్తలు పార్టీ వదల్లేదు. పార్టీ నుంచి నాయకులు వెళ్లారు కానీ… కార్యకర్తలు వెళ్లలేదు. తెలుగుజాతి ఉన్నంత వరకు తెదేపా జెండా రెపరెపలాడుతుంది. తెలుగుజాతి ఉన్నంత వరకు తెలుగు దేశం పార్టీ ఉంటుంది.” అని చంద్రబాబు ఉద్ఘాటించారు.