కుటుంబ బాధ్యతలను పూర్తిగా విస్మరించి మద్యం వ్యసనానికి బానిసైన ఓ భర్త తన భార్యను గొడ్డలితో నరికి హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం అయ్యవారిపల్లిలో చోటు చేసుకుంది. మద్యం కొరకు ప్రతి రోజూ భార్యను డబ్బుల కోసం వేధిస్తున్న భర్త, ఆమె డబ్బులు ఇవ్వకపోవడంతో అతిదారుణంగా చంపేశాడు. ఈ ఘటన గ్రామాన్ని షాక్ కి గురి చేసింది.
షాద్ నగర్ పట్టణ సీఐ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల పరుశురాములు తన భార్య జానమ్మతో తరచూ గొడవ పడేవాడు. సంసార బాధ్యతలు పట్టించుకోకుండా రోజంతా జులాయిగా తిరుగుతూ మద్యం కోసం డబ్బులు అడిగేవాడు. భార్య డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో అతడు ఆగ్రహంతో రాత్రి గొడ్డలితో ఆమె పై దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. పరుశురాములు పనికి వెళ్లకుండా రోజంతా దొడ్డిదారిన తిరుగుతూ మద్యం తాగడమే అలవాటుగా మార్చుకున్నాడు.