రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ లేఖ రాశారు. టెట్ పరీక్ష ఫీజు తగ్గించాలని లేఖలో కోరారు. మరోవైపు టెట్ పరీక్ష నిర్వహణకు 33 జిల్లాల్లోనూ కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. పరీక్షకు సరైన వసతులు కల్పించాలని విన్నవించారు. టెట్ పరీక్ష ఫీజు పెంచడం వల్ల చాలా మంది పేద అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పారు. ఈ క్రమంలో ఫీజు తగ్గించాలని కోరుతూ లేఖ రాశారు.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) దరఖాస్తుకు రాష్ట్ర విద్యాశాఖ భారీగా రుసుం పెంచిన విషయం తెలిసిందే. గతంలో ఒక పేపర్ రాస్తే రూ.200 రుసుం ఉండగా దాన్ని రూ.వెయ్యికి పెంచింది. రెండు పేపర్లు రాస్తే గతంలో రూ.300 రుసుము ఉండగా దాన్ని రూ.2,000కు పెంచుతూ నిర్ణయం టెట్‌కు సంబంధించిన సమాచార పత్రాన్ని విడుదల చేసింది. ఇందులో రుసుముల వివరాలు, ఇతర అంశాలను వెల్లడించింది. ఈ నెల 15వ తేదీన టెట్-2024 నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల పదో తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.