హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా వాల్ పోస్టర్లు, బ్యానర్లు దర్శనమిస్తుంటాయి. అయితే ఇక నుంచి నగరంలో పోస్టర్లను బ్యాన్ చేస్తున్నట్టు తాజాగా GHMC కమిషనర్ ఆమ్రపాలి ప్రకటించారు. ప్రధానంగా వాల్ పోస్టర్లు, వాల్ పెయింటింగ్స్ పై సీరియస్‌గా వ్యవహరించాలని సర్క్యులర్ జారీ చేశారు కమిషనర్. సినిమా థియేటర్ వాళ్ళు కూడ ఎక్కడా పోస్టర్లు అతికించకుండా చూడాలని డిప్యూటీ కమిషనర్లకు ఆదేశించారు. నగరంలో ఎక్కడైనా పోస్టర్లు వేస్తే జరిమానా విధించాలని ఆదేశించారు GHMC కమిషనర్ ఆమ్రపాలి రెడ్డి.
పోస్టర్ల పై జీహెచ్ఎంసీ తీసుకున్న నిర్ణయం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా పుట్టిన రోజు వేడుకలు, ఫంక్షన్లు, సినిమాలకు బ్యానర్లు ఇలా రకరకాలుగా పోస్టర్లు వేస్తుంటారు. ఇలా పోస్టర్లు వేయకుంటే చాలా మందికి తెలియదని.. మరికొందరూ ఉపాధి కోల్పాతరని రకరకాలుగా ప్రభుత్వం పై, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి పై ఫైర్ అవుతున్నారు. అక్కడ పడితే అక్కడ పోస్టర్లు వేస్తే.. చర్యలు తీసుకోవాలని.. కానీ నగరం మొత్తం అంటే ఎలా..? అని చర్చించుకోవడం గమనార్హం.