ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి మొదటి విడతగా 30 మంది అభ్యర్థులను ఎంపిక చేసుకున్నాయని.. వారికి కేసీఆర్ ఫండింగ్ చేస్తున్నారని ఆరోపించారు. వారు కాంగ్రెస్‌లో గెలిస్తే తిరిగి బీఆర్ఎస్లోకి రావడానికే ఈ వ్యూహం అని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్‌కు బీఆర్ఎస్ కంటే.. కాంగ్రెస్ అభ్యర్థులపైనే నమ్మకం ఎక్కువగా ఉందని ఎద్దేవా చేశారు. ‘కాంగ్రెస్‌లో ఉన్నోళ్లందరూ మావాళ్లే అనే ఫీలింగ్‌లో కేసీఆర్ ఉన్నారు’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
తెలంగాణ సెంటిమెంట్ రగిల్చి సీఎం కేసీఆర్ మరోసారి లబ్ధిపొందాలని చూస్తున్నారంటూ బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ‘ఇంటింటికీ బీజేపీ’ కార్యక్రమానికి బీజేపీ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఒక్కో కార్యకర్త పోలింగ్‌బూత్‌లో వంద కుటుంబాల వద్దకు వెళ్లేందుకు కార్యాచరణ రూపొందించారు. దీనిలో భాగంగా కరీంనగర్‌లోని చైతన్యపురి 173వ పోలింగ్ బూత్ పరిధిలోని ప్రజలతో సంజయ్ మమేకమయ్యారు. 9 ఏళ్ల మోదీ పాలనను వివరిస్తూ కరపత్రాలు పంచిపెట్టారు.