తెలంగాణ సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. 57 సంవత్సరాలు దాటిన వారందరికీ పింఛన్లు ఇవ్వాలని కోరిన సంజయ్.. బహిరంగ లేఖ విడుదల చేశారు. ఆసరా పెన్షన్ల వయోపరిమితిని 57 ఏళ్లకు తగ్గిస్తున్నట్లు టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీ ఏమైంది? అని నిలదీశారు. 57 ఏళ్లు నిండిన అర్హులైన దాదాపు 11 లక్షల మంది కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారని.. 2018 లో సర్కార్ ఇచ్చిన హామీ అమలైతే ఒక్కో ఆసరా పించను లబ్ధిదారులకి ప్రభుత్వం ఇఫ్పటి వరకు రూ.78,624 లు లబ్దిపొందే వారని చెప్పారు.
ఈ మేరకు బకాయిపడ్డ రూ.78,624 లను వృద్ధులకు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని.. ఏప్రిల్ 1 నుండి కొత్త పెన్షన్లు ఇస్తామని ప్రభుత్వ ఆర్భాటపు ప్రకటనలే తప్ప అందుకు తగ్గ కసరత్తు లేకపోవడం శోచనీయమని ఫైర్ అయ్యారు. దరఖాస్తుల స్వీకరణకు అవసరమైన మార్గదర్శకాలను సైతం విడుదల చేయకపోవడం సర్కార్ నిర్లక్ష్యానికి నిదర్శనమని.. కొత్త పెన్షన్ల కోసం ఏళ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాలు, అధికార పార్టీ నేతల చుట్టు తిరుగుతున్నా ఫలితం లేదని వెల్లడించారు.
ఒక కుటుంబానికి ఒకే ఆసరా పెన్షన్ మంజూరు చేస్తామని ప్రకటించడం అన్యాయం. అర్హులైన వారందరికీ పెన్షన్ ఇవ్వాల్సిందేనని..ఆసరా పెన్షన్ లబ్దిదారుడు మరణిస్తే…ఆ కుటుంబంలో అర్హులుంటే వెంటనే వారికీ పెన్షన్ ను వర్తింపజేయాలన్నారు. ఒకే కుటుంబానికి ఒకే ఆసరా పెన్షన్ అని నిర్ణయించడం అన్యాయమని.. ప్రభుత్వ అనాలోచిత చర్యవల్ల దాదాపు 2 లక్షల మంది వృద్ధులు పెన్షన్ కు నోచుకోవడం లేదని పేర్కొన్నారు. తక్షణమే నూతన మార్గదర్శకాలను విడుదల చేసి కొత్త పెన్షన్లకు అవసరమైన నిధులను బడ్జెట్ లో కేటాయించాలని డిమాండ్ చేశారు.