నేడు పార్టీ శ్రేణులతో కలిసి వేములవాడ రాజన్న ఆలయ మెట్లపై ధర్నాకు దిగారు కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. సీఎం కేసీఆర్ వేములవాడ పర్యటనలో రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి వంద కోట్లు కేటాయిస్తానన్నాడని, మిడ్ మానేరు ముంపు బాధితులకు 5 లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని మండిపడుతూ ధర్నాకి దిగారు.
ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రికి సోయి లేకపోతే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఎంపీ, జిల్లా మంత్రి నిద్రపోతున్నారా..? అని ప్రశ్నించారు. కెసిఆర్ ఇచ్చిన హామీలను గుర్తు చేయడానికి ప్రతి సంవత్సరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక విధాలుగా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థులను కూడా కేసీఆర్ డిసైడ్ చేస్తారని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు పొన్నం.
కాంగ్రెస్ సీట్ల గురించి తర్వాత మాట్లాడదామని.. కల్వకుంట్ల కవిత ఎందుకు అరెస్టు కాలేదో సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత కోసం జైలులో రూమ్ సిద్ధం చేశామని అన్నారు కదా..? ఏమైందని నిలదీశారు. బండి సంజయ్ చేసిన పాదయాత్ర వెనుక కేసీఆర్ లేడా..? అని ప్రశ్నించారు. తన పదవి పోతుందని బండి సంజయ్ పిచ్చిపిచ్చిగా వాగుతున్నాడని తీవ్ర విమర్శలు చేశారు.