ఓ వ్యక్తి ఒకే స్కూటర్తో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 643 సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాడు. ప్రతిసారి తప్పించుకుంటున్నానని భావిస్తూ ఈజీగా రూల్స్ బ్రేక్ చేశాడు. కానీ చివరకు పోలీసులు విధించిన జరిమానా చూసి షాక్ అయ్యాడు. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులోని గంగాధరనగర్కు చెందిన ఓ వ్యక్తి హెల్మెట్ లేకుండా రెండేళ్లుగా బైక్( KA04KF9072 నంబర్)పై అతడు ప్రయాణించడమే కాకుండా, ఇతర వ్యక్తులకూ తన బైక్ ఇచ్చాడు. ఈ క్రమంలో 643 సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడంతో పోలీసులు అతడికిరూ. 3.22 లక్షల జరిమానా విధించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని గుర్తించేందుకు బెంగళూరు పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. ఇందుకోసం నగరంలోని ప్రతి జంక్షన్ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటి సహాయంతో ట్రాఫిక్ రూల్స్ను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఫుటేజీ ఆధారంగా వారికి జరిమానా విధిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ బైకర్ 643 సార్లు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినట్లు గుర్తించి జరిమానా విధించారు.