తెలంగాణ రైతులకు శుభవార్త. తెలంగాణలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసిఎస్)ల సంఖ్యను భారీగా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పుడున్న 906 సంఘాల సంఖ్యల ఏకంగా 2600 కు చేయించాలని భావిస్తుంది. కేంద్ర ప్రభుత్వ కొత్త సహకార విధానం నేపథ్యంలో తెలంగాణలోనూ విస్తరణపై దృష్టిసారించింది.
దేశంలో సహకార వ్యవస్థ బలోపేతానికి ఇటీవల కేంద్రమంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రతి గ్రామ పంచాయతీలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం, పాడి సహకార సంఘం, మత్స్య సహకార సంఘాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఏడాది కాలంగా ఈ విధానానికి అవసరమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కోరుతోంది. కేంద్ర ప్రతిపాదనల నేపథ్యంలో రాష్ట్రంలో సహకార వ్యవస్థ విస్తరణతో పాటు దాన్ని పటిష్టం చేయాలని తెలంగాణ సర్కారు తలపిస్తోంది.