శ్రీశైలం నుంచి భారీగా వరద పోటెత్తడంతో నాగార్జునసాగర్ డ్యాం నిండుకుండలా మారింది. దీంతో అధికారులు డ్యామ్ గేట్లన్నీ ఎత్తారు. 26 గేట్లు ఎత్తడంతో నీళ్లు జాలువారుతూ సాగర్ వద్ద అద్భుత జలదృశ్యం ఆవిష్కృతమైంది. బుధవారం ఉదయం 11 గంటల నుంచి గురువారం ఉదయం 10 గంటల వరకు అధికారులు 18 గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. ఇక 10 గంటల తర్వాత 26 గేట్లనూ ఎత్తి నీటిని దిగువకు పంపారు.
ఇక ఇవాళ ఉదయం 22 గేట్లు 5 అడుగులు, 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటి విడుదల చేస్తున్నారు. జలాశయ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 585.70 అడుగులకు చేరింది. నాగార్జునసాగర్ పూర్తి నీటి నిల్వ 312.50 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 303.94 టీఎంసీల వద్ద నీరు నిల్వ ఉంది. శ్రీశైలం నుంచి వరద తక్కువగా వస్తున్నప్పటికీ గేట్లపై భారం పడకుండా ఉండేందుకు దిగువకు విడుదల చేస్తున్నామని సాగర్ ఈఈ మల్లికార్జునరావు వెల్లడించారు.