సీఎం కేసీఆర్ ను కలిసిన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్

-

దళితుల అభ్యున్నతి, వారి సంక్షేమం కోసం రాష్ట్రంలో అమలవుతున్న దళితబంధు సహా పలు పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, ఎస్సీ కులాలను సామాజిక, ఆర్థిక వివక్ష నుండి ఆత్మ గౌరవం దిశగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న దళిత ప్రగతి కార్యాచరణ దళిత జాతి విముక్తికి బాటలు వేసేలా ఉందని, ఇది యావత్ దళిత జాతి గర్వించదగ్గ సందర్భమని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. హైదరాబాద్ పర్యటన సందర్బంగా శుక్రవారం నాడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు గారితో చంద్ర శేఖర్ ఆజాద్ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా సాగిన సుధీర్ఘ చర్చలో దేశంలో దళితుల పరిస్థితి, దళితుల పట్ల పాలకులు అనుసరిస్తున్న వైఖరులు, మరింతగా కులం పేరుతో మనుషులను విభజిస్తూ, సామాజిక వివక్షకు గురిచేస్తూ, ఆహార నియమాలను నియంత్రిస్తూ, దళితులపై దేశంలో అమలవుతున్న దమనకాండను ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గారితో ఆజాద్’ చర్చించారు.చర్చ సందర్భంగా చంద్రశేఖర్ ఆజాద్ మాట్లాడుతూ…. తెలంగాణలో అమలవుతున్న దళిత అభివృద్ధి కార్యాచరణ భవిష్యత్ లో దేశంలోని దళితుల సమస్యల పరిష్కారానికి బాటలు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

దళితబంధు పథకం దేశ చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో అమలవుతున్న పథకమని స్పష్టం చేశారు. దళితబంధు విజయగాథలను తాను తెలుసుకున్నానని, వారి జీవితాల్లో గుణాత్మక మార్పు ప్రారంభమైందని, ఇది ఎంతో గొప్ప విషయమని ఆజాద్ అన్నారు. అట్టడుగు స్థాయిలో పనిచేసే దళితుల సాధికారతకు తోడ్పడుతూ, వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్న దళితబంధు పథకం అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కొనసాగుతున్నదన్నారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ నడిగడ్డ పై 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించడం సీఎం కేసీఆర్ గారికి అంబేద్కర్ పట్ల ఉన్న అభిమానానికి, వారి ఆశయాల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలిచిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news