బీజేపీలో అసంతృప్తితో ఉన్న సీనియర్ నేత ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముంగిట నేతల మధ్య సమన్వయ లోపం వల్ల పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని గుర్తించిన అధిష్ఠానం.. అసంతృప్తి చల్లార్చే అంశంపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే ఈటల, రాజగోపాల్ రెడ్డిని దిల్లీకి పిలిచింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేడీ నడ్డాతో ఇవాళ వీరిద్దరూ భేటీ కానున్నారు. పార్టీలో అంతర్గత వ్యవహారాలు చక్కదిద్దిన తర్వాతే తెలంగాణలో పర్యటించాలని అగ్రనేతలు భావిస్తున్నారు.
పార్టీలోని ముఖ్యనేతలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విడివిడిగా సమావేశమై.. తాజా పరిస్థితులపై చర్చించారు. బీఆర్ఎస్ను ఎదుర్కొనే వ్యూహాలపై చర్చించారు. పార్టీలో నెలకొన్న స్తబ్ధతపై సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గ్రూపు రాజకీయాల వల్ల నష్టం జరుగుతోందని చెప్పినట్లు సమాచారం. పార్టీని వీడాలనుకునే వారిని ఆపవద్దని కోరినట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి ఎవరూ వేరే పార్టీలోకి వెళ్లరని రాష్ట్ర కమలదళ సారథి బండి సంజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు.