ఇందిరమ్మ రాజ్యమంటే.. కూలగొట్టడం, కొల్లగొట్టడం, అమ్మడంకోసమేనా..? : ప్రభాకర్

-

సోనియా గాంధీ పట్ల విధేయత చాటుకుని, నమ్మకం కలిగించుకునేలా ప్రసన్నం చేసుకోవాలని రేవంత్ రెడ్డి నానా రకాలుగా మాట్లాడుతున్నాడు. అయినా, కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ ను నమ్మడం లేదనే విషయంలో అనేక అంశాల ద్వారా స్పష్టమవుతున్నది అని బీజేపీ లీడర్, మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్. ప్రభాకర్ అన్నారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కాంట్రాక్టు రాహుల్ గాంధీ చెప్పినట్లుగానే రేవంత్ ముందుకెళ్తున్నడు. కులగణన, రైతు రుణమాఫితో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాల విషయంలో అదే తంతు నడుస్తున్నది. అసలు తెలంగాణ రాష్ట్రానికి రాహుల్ ముఖ్యమంత్రా.. లేక రేవంత్ రెడ్డా అని ప్రశ్నించారు.

ఇక రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ఒక్క కొత్త రేషన్ కార్డు ఇయ్యలేదు. ఒక్క విద్యార్థికి కూడా ఫీజు రీయింబర్స్ మెంట్ చేసిన దాఖలాల్లేవు. ప్రభుత్వ బకాయిల కారణంగా ఏ ప్రైవేటు ఆసుపత్రిలో కూడా ఆరోగ్య శ్రీ ని సక్రమంగా అమలు చేయడం లేదు. దీనిపై సర్కారు కనీసం సమీక్షించలేదు. ప్రభుత్వం రైతు రుణమాఫీ చెల్లించదని చెప్పి.. రైతులకు బ్యాంకు అధికారులు పాసుపుస్తకాలు తిరిగి ఇచ్చిన దాఖలాలు ఎక్కడైనా కనపడుతోందా..? ఇందిరమ్మ రాజ్యమంటే.. కూలగొట్టడం, కొల్లగొట్టడం.. దోచుకోవడం, దాచుకోవడం. భూములు అమ్మడం, బీర్లు అమ్మడంకోసమేనా. కాంగ్రెస్ సర్కారు భయానక పాలనలో రాష్ట్రంలో ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బతుకు వెల్లదీస్తున్నరు. రేవంత్ రెడ్డి గత ఎన్నికల సమయంలో దేవుళ్లపై ఒట్టు పెట్టి గట్టెక్కే విధంగా ఓట్లు దండుకుని పబ్బం గడుపుకున్నాడు. దేవుడికి ఆగ్రహం వస్తుందేమోనని, తన పీఠం కదులుతుందేమోననే భయంతో రేవంత్ ఒక్కో దేవాలయాన్ని సందర్శిస్తున్నడు అని పేర్కొన్నారు ప్రభాకర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version