అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహుల నుంచి బీజేపీ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. తొలిరోజే ఆశావహుల నుంచి భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. మొదటి రోజు 182 దరఖాస్తులు అందినట్లు బీజేపీ నేతలు తెలిపారు. గడువు ముగిసే పదో తేదీ నాటికి వెయ్యికిపైగా దరఖాస్తులు వస్తాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తొలి రోజు 63 మంది ఆశావహులే… ఏకంగా 182 దరఖాస్తులు సమర్పించారు. ఒక్కొక్కరు రెండు, మూడు అసెంబ్లీ స్థానాలకు దరఖాస్తు చేసుకున్నారు. తొలి ప్రాధాన్యతగా పెట్టుకున్న స్థానం దక్కకపోతే మరో చోటైనా అవకాశం దక్కుతుందనే ఆశతో అభ్యర్థులు తమ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను బీజేపీ మూడు దశల్లో చేపట్టనున్నట్లు తెలుస్తోంది. జిల్లా, రాష్ట్ర, కేంద్ర పార్టీ స్థాయిలో స్క్రీనింగ్ చేపట్టి.. రాష్ట్ర పార్టీ ప్రాసెసింగ్ చేసిన తర్వాత జాతీయ కమిటీకి జాబితా చేరనుంది. ఆ తర్వాతే అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. రాష్ట్ర స్థాయిలో దరఖాస్తుల పరిశీలన కోసం త్వరలో ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. తొలి అభ్యర్థుల జాబితాను ఈ నెల 17తరువాత ప్రకటించేందుకు బీజేపీ రంగం సిద్ధం చేస్తోంది.